Miyapur murder | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

Miyapur murder |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వివాహేతర సంబంధాలతో భర్తలను భార్యలు కడతేరుస్తున్నఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని మియాపూర్‌లో చోటుచేసుకుంది. గతేడాది నమోదైన ఓ మిస్సింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. భర్త కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించిన మహిళే, తన ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది.

పోలీసుల కథనం ప్రకారం.. గత ఏడాది నవంబర్‌లో ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు అతని భార్య ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తొలుత ఎలాంటి ఆధారాలు లభించకపోయినా, సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత కేసు కొత్త మలుపు తిరిగింది.

దర్యాప్తులో మహిళ కాల్ వివరాలు, సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించిన అధికారులు ఆమె కదలికలపై అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం ఆమెను, ఆమెకు సన్నిహితంగా ఉన్న వ్యక్తిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్యకు పథకం రచించి, అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల సమాచారంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.