ఈ నెల 20లోగా ఎస్‌ఐఆర్ ఫారాలు అందజేయాలి

చెన్నూర్, జూలై 7 (ఆంధ్రప్రభ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ప్రజలు సహకరించి ఈ నెల 20లోగా సంబంధిత ఫారాలను సమర్పించాలని చెన్నూర్ తహసీల్దార్ మల్లికార్జున్ కోరారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. ఇంటింటి సర్వే, ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియ పురోగతిని అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, ఓటరు జాబితా శుద్ధి ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, బీఎల్‌వోలు ఇంటింటికి వచ్చినప్పుడు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఫారాలను సక్రమంగా నింపి ఈ నెల 20వ తేదీలోగా అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.