ఎల్‌నినో ప్రభావం.. రైతులు ఆందోళన చెందొద్దు: అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రభ, శ్రీకాకుళం: దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అయినప్పటికీ వంశధార క్యాచ్‌మెంట్ ప్రాంతంలో నీటి లభ్యత పూర్తిస్థాయిలో లేకున్నా, జిల్లా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాగునీటిని విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు.

మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నీటి లభ్యత పరిమితంగా ఉన్న నేపథ్యంలో రైతులు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కాలువల శివారు ప్రాంతాల్లోని పంట పొలాలకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించిన ఆయన, క్షేత్రస్థాయిలో సాగునీటి సమస్యలు తలెత్తకుండా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.