నేటి నుంచి ధ్వజ శిఖర సమేత ప్రతిష్ఠ మహోత్సవాలు

ఊర్కొండ, ఆంధ్రప్రభ: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ మండలం నర్సంపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ పబ్బాతి ఆంజనేయస్వామి ఆలయంలో జీవ, ధ్వజ శిఖర సమేత ప్రతిష్ఠ మహోత్సవాలు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ పులిమామిడి శైలజ శ్రీశైలం తెలిపారు.

అర్చకులు శ్రీ సిరివెళ్లి దత్తాత్రేయ శర్మ, సిరివెళ్లి శ్రీను శర్మ ఆధ్వర్యంలో జూలై 7 నుంచి 9 వరకు జరిగే ఈ మహోత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర నిజ జ్యేష్ఠ బహుళ సప్తమి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

మహోత్సవాల్లో భాగంగా జూలై 7న ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురారోపణం, రక్షాబంధనం, అఖండ జ్యోతి దీపస్థాపన నిర్వహించగా, సాయంత్రం జలాధివాసం జరగనుంది.

జూలై 8న ఉదయం యాగశాల ప్రవేశం, దేవతాహ్వానం, సామూహిక హోమాలు, మహాన్యాసం నిర్వహించనుండగా, సాయంత్రం ప్రతిష్ఠ మూర్తులకు ధాన్యాధివాసం, చతుర్వేద స్వస్తి, మహా మంగళహారతి నిర్వహిస్తారు.

జూలై 9న ఉదయం మంటప పూజల అనంతరం కన్యాలగ్నంలో యంత్ర స్థాపన, మూర్తి ప్రాణ ప్రతిష్ఠ, నేత్రోన్మీలనం, పూర్ణాహుతి, వేద ఆశీర్వచనాలు నిర్వహించనున్నారు.

ఈ మహోత్సవాలకు నర్సంపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని, తీర్థప్రసాదం, అన్నప్రసాదం స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ పులిమామిడి శైలజ శ్రీశైలం కోరారు.