ఉడుంపూర్‌లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి (శీతల దేవి) ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ మరియు గ్రామస్తులు తెలిపారు.

ఈ నెల 7వ తేదీన మంగళవారం గణపతి పూజ, గోపూజ, గురువందనం, దక్షిణ ధారణం, యాగశాల ప్రవేశం, నవగ్రహ వాస్తు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం అమ్మవారి ఊరేగింపు, అగ్ని ప్రతిష్ట, జలాధివాసం కార్యక్రమాలు జరుగుతాయి. 8వ తేదీ బుధవారం స్థాపిత దేవత పూజలు, హోమాలు, రుద్రహవనం, సుత్త హోమాలు నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు కళాశాసనం, మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాలు చేపడతారు.

9వ తేదీ గురువారం శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో స్థిర యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ స్థాపన, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు ఉడుంపూర్ గ్రామస్తులు, జీపీ పరిధిలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పొందాలని నిర్వాహకులు కోరారు.

ఈ ఉత్సవాల ఏర్పాట్లను ఉడుంపూర్ గ్రామ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్తా, ఉప సర్పంచ్ నాగవత్ సరిత, ప్రభాకర్, జీపీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు మరియు గ్రామస్తులు, దాతల సహకారంతో పూర్తి చేశారు.