Revanthreddy | టూరిజం రంగానికి కొత్త ఊపు
పర్యాటక రంగంపై సీఎం రేవంత్ ఫోకస్..
తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక నిర్ణయాలు
తారామతి బారాదరి, దుర్గం చెరువు, వికారాబాద్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జి, అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజానికి ప్రాధాన్యం..
డిసెంబరులో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్
Revanthreddy |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. చారిత్రక, ప్రకృతి, ఆధ్యాత్మిక, ఎకో టూరిజం కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లోని తారామతి బారాదరి, దుర్గం చెరువును ఆధునిక సౌకర్యాలతో కూడిన టూరిజం హబ్‌లుగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. అలాగే మంజీరా, దిల్కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునీకరించి దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
టూరిజం హబ్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వికారాబాద్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతగిరి అటవీ ప్రాంతం, ప్రకృతి అందాలను వినియోగించుకుని పర్యాటక రంగాన్ని మరింత విస్తరించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
భద్రాద్రి జిల్లాలోని వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి యాదాద్రి తరహాలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (క్యూర్) పరిధిలోని అటవీ భూములను పర్యాటక శాఖతో సమన్వయం చేసి ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే ఫ్యూచర్ సిటీలోని అటవీ ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు.
చారిత్రక ప్రాధాన్యం కలిగిన పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిని ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. వారసత్వ సంపదను పరిరక్షిస్తూ పర్యాటకులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు.
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో డిసెంబరులో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించాలని సీఎం ప్రకటించారు. ఈ సమ్మిట్ విజయవంతం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
