నేతకాని కులాన్ని గెజిట్‌లో చేర్చాలి

నేతకాని కులాన్ని గెజిట్‌లో చేర్చాలి

  • సంక్షేమ సంఘం డిమాండ్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నేతకాని కులాన్ని అధికారిక గెజిట్‌లో చేర్చాలని నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కలాలి నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి గోమాస రాజం, జిల్లా ఉపాధ్యక్షుడు చదువుల వెంకట రమణ, నేతకాని మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి ముడిమడుగుల గీతరాణి డిమాండ్ చేశారు.

ఆదివారం బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 15 లక్షలకు పైగా నేతకాని కుల జనాభా ఉన్నప్పటికీ, జనగణనలో సాలే, మాలే కులాల కింద చూపుతూ కేవలం 1.70 లక్షల జనాభాగా నమోదు చేయడం అన్యాయమని విమర్శించారు.

నేతకాని కులాన్ని గెజిట్‌లో చేర్చకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమస్యపై రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతూ వినతి పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు.

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల నేతకాని కుల జనాభా ఉన్న నేపథ్యంలోనే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ స్థానాన్ని నేతకాని వర్గానికి కేటాయించిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, జనాభాకు అనుగుణంగా నేతకాని కులాన్ని గెజిట్‌లో చేర్చాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో నాయకులు గోమాస జువ్వాజీ, గోమాస శ్రీనివాస్, దుర్గం భరత్, బెడ్డల మహేందర్, గోమాస వినోద్, గోమాస రాజేశ్వర్, చల్లూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply