ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు
- ఏళ్ల తరబడి ఫైళ్లు పెండింగ్‌లో పెడితే ఎలా?
- డివిజన్ స్థాయిలో పరిష్కరించగల ఒక్క ఫైల్ కూడా పెండింగ్‌లో ఉండొద్దు
- రెవెన్యూ, అటవీ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
- కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ.. 16 అంశాలపై సమీక్ష
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: ప్రజలు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే, అధికారులు ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడం సరికాదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక టేబుల్ నుంచి మరో టేబుల్‌కు ఫైళ్లను పంపించడం పరిపాలన కాదని, ప్రజల సమస్యలకు చట్టబద్ధమైన, శాశ్వత పరిష్కారం చూపడమే అసలైన పరిపాలన అని స్పష్టం చేశారు.
సోమవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ, అటవీ, భూ సమస్యలపై ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఒరిజినల్ ఫైళ్లు, నోట్ ఫైళ్లు, సంబంధిత రికార్డులను తెప్పించి ఒక్కో అంశాన్ని స్వయంగా పరిశీలించారు.

ఫైళ్లు ఏ దశలో ఉన్నాయి, ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి, ఎవరి వద్ద నిలిచిపోయాయి, పరిష్కారం కోసం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. గతంలో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఆదేశాలు ఇచ్చినా అనేక అంశాలు ఇప్పటికీ అదే దశలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
“ఒక ఫైల్ మీ వద్దకు వస్తే మరో అధికారికి పంపించి చేతులు దులుపుకోవడం కాదు. క్షుణ్ణంగా పరిశీలించి చట్టబద్ధమైన పరిష్కారం చూపాలి” అని మంత్రి అధికారులకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అనవసరంగా ఫైళ్లను పెండింగ్‌లో ఉంచితే సహించేది లేదని హెచ్చరించారు.
16 అంశాలపై సమీక్ష
ముక్కిడిగుండం, సోమశిల, రామాపురం, ఎల్లూరు, జటప్రోలు, గోపాలపురం శివారు, సింగోటం, కొల్లాపూర్, చింతలపల్లి, సోమశిల రోడ్డు, చౌటబెట్ల శివారుకు సంబంధించిన పోడు పట్టాలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్, రెవెన్యూ-అటవీ భూ వివాదాలు, జాయింట్ సర్వేలు, పట్టాదారు హక్కులు, లావోని పట్టాలు, భూ రికార్డుల సవరణ, ఫోడి సర్వే, పీఓటీ రెగ్యులరైజేషన్, భూభారతి, వ్యవసాయ మార్కెట్ యార్డు, హార్టికల్చర్ పాలిటెక్నిక్, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 16 అంశాలపై మంత్రి క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు.
అర్జిదారులతో నేరుగా చర్చ..
ప్రతి అంశానికి సంబంధించిన అర్జిదారులను సమావేశానికి పిలిపించి, గ్రామ పాలన అధికారి (జీపీఓ), రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, సర్వే అధికారులు, ఆర్డీఓ కార్యాలయ సిబ్బందితో కలిసి సమస్యలను పరిశీలించారు. ఎవరి స్థాయిలో ఏ నివేదిక ఇవ్వాలి, ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుని రికార్డు చేయాలని ఆదేశించారు.
డివిజన్ స్థాయిలో పరిష్కరించగల ఒక్క ఫైల్ కూడా పెండింగ్‌లో ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. కలెక్టర్ స్థాయిలో నిర్ణయం అవసరమైన అంశాలకు పూర్తి ప్రతిపాదనలు, సంబంధిత రికార్డులతో వెంటనే పంపాలని ఆదేశించారు.
ప్రతి ఫైల్‌కు కార్యాచరణ ప్రణాళిక..
ప్రతి ఫైల్ ఏ దశలో ఉంది, ఎందుకు పెండింగ్‌లో ఉంది, ఏ అధికారి వద్ద ఉంది, తదుపరి ఎవరు ఏ చర్య తీసుకోవాలి, ఎంత గడువులో పరిష్కరించాలనే వివరాలతో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు.
క్యాంపు కార్యాలయం నుంచి వచ్చే ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించాలని, విచారణకు అవసరమైతే సమయం తీసుకున్నా ఫైళ్లను అనవసరంగా పెండింగ్‌లో ఉంచొద్దని చెప్పారు. ప్రజలు మళ్లీ అదే సమస్యతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా దీర్ఘకాలిక సమస్యలకు చట్టబద్ధమైన, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో రెవెన్యూ, సర్వే, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు.
