సర్ ప్రక్రియపై అపోహలు నమ్మొద్దు..
- బీజేపీ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్
భీంగల్ రూరల్, ఆంధ్రప్రభ: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై ప్రజలు ఎలాంటి అపోహలు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని బీజేపీ భీంగల్ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ కోరారు.
సోమవారం భీంగల్ మండలంలోని బాచన్పల్లి గ్రామంలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఓటరు ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, సేకరణ ప్రక్రియను స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమం ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు ఉద్దేశించిన కీలక ప్రక్రియ అని తెలిపారు. అయితే కొందరు కావాలనే ఈ కార్యక్రమంపై ప్రజల్లో అనుమానాలు, అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు విశ్వసించవద్దని సూచించారు.
అర్హులైన ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారమ్‌ను తప్పనిసరిగా స్వీకరించి, అవసరమైన వివరాలు, సంబంధిత పత్రాలతో పూర్తిగా నింపి బూత్ లెవల్ అధికారికి సమర్పించాలని కోరారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం ప్రజాస్వామ్య బలోపేతానికి అవసరమని పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం విడుదల చేసే అధికారిక మార్గదర్శకాలను మాత్రమే అనుసరించాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత ఎన్నికల అధికారులు లేదా బీఎల్వోలను సంప్రదించి సరైన సమాచారం తెలుసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరు తన బాధ్యతను గుర్తించి ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని ఓటరు జాబితా నవీకరణకు సహకరించాలని ఆరే రవీందర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా మండల అధ్యక్షుడు శెట్టి ప్రేమ్‌చంద్, బీజేపీ సీనియర్ నాయకులు శెట్టి లక్ష్మణ్, నర్సింగ్, వన్నెల వంశీ, సాయి చరణ్, భాగ్యరాజ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
