ఆలయం అభివృద్ధి పేరుతో ఇసుక రవాణా..

  • లారీలనుఅడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

టేకుమట్ల, ఆంధ్రప్రభ: టేకుమట్ల మండలం బూర్ణపల్లి గ్రామంలోని మానేరు వాగులో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సోమవారం అడ్డుకున్నారు.

ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అందిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ఆయన, కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి పేరుతో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీలను నిలిపివేసి సంబంధిత అధికారులను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి పేరుతో వాగు నుంచి ఇసుకను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం తరలించడం సరికాదన్నారు. ఇసుక తవ్వకాలు ఎవరి అనుమతితో జరుగుతున్నాయో తహసీల్దార్, సీఐ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇసుక మాఫియా విచ్చలవిడిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సంపదను కొల్లగొట్టే అక్రమ ఇసుక దందాను బీఆర్ఎస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు.

అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమాలను పూర్తిగా అరికట్టాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.