సింగరేణి అధికారుల పోరాటానికి జనసేన మద్దతు..
గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు పరిశ్రమ అధికారుల న్యాయమైన పోరాటానికి జనసేన పూర్తిస్థాయిలో మద్దతుగా అండగా నిలుస్తుందని జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, సినీ నటుడు సాగర్ స్పష్టం చేశారు. ఆదివారం పెద్దపెల్లి జిల్లా రామగుండం గోదావరిఖనిలోని సింగరేణి జిఎం కార్యాలయం వద్ద అఖిలభారత బొగ్గు గనుల అధికారుల సంఘం (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను జనసేన రాష్ట్ర నేత సాగర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. బొగ్గు పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అధికారుల హక్కుల సాధనలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం సరైంది కాదన్నారు.
కోల్ ఇండియాలో పే అప్గ్రేడ్ అమలు జరుగుతున్నప్పటికీ సింగరేణిలో అమలు చేయకుండా కాలయాపన చేయడం పై సాగర్ మండిపడ్డారు. జీతంలో ఒక భాగమైన పిఆర్పిని గడిచిన మూడు సంవత్సరాలుగా చెల్లించకపోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. కార్మికుని బిడ్డగా బొగ్గు గని కార్మికులు… అధికారుల సమస్యలు తనకు తెలుసునని గడిచిన ఏడు రోజులుగా హక్కుల సాధన కోసం సింగరేణి అధికారులు కోల్ బెల్ట్ ఏరియా వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ముందు సింగరేణి అధికారిని నిరసన దీక్షలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం గానీ… సింగరేణి యాజమాన్యం కానీ ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని తప్పుపట్టారు.

ఉద్యమాలకు పోరాటాలకు రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఒక వేదికని ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల పరిష్కార విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికి కష్ట కాలం ఎదురవడం తప్పదని సాగర్ హెచ్చరించారు. సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు వారికి అండగా జనసేన పార్టీ ముందుండి పోరాటాలను చేస్తోందని సాగర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు దీటి చంద్రమౌళి, డాక్టర్ రావుల మధు, వీరారెడ్డి, శ్రావణ్ కుమార్ తోపాటు జనసేన ముఖ్యనాయకులు రావుల మధు, బేతి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
