నందిపాడు చౌరస్తాలో రోడ్డు ప్రమాదం.. వృద్ధురాలు మృతి

కంటైనర్ ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతి..

ఫ్లైఓవర్ నిర్మించాలని రాస్తారోకో

మిర్యాలగూడ, (ఆంధ్రప్రభ): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు చౌరస్తా వద్ద అద్దంకి–నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాటర్ ట్యాంక్ తండాకు చెందిన ధనావత్ కమ్లి (55), ఆమె భర్త సక్రును రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కమ్లి అక్కడికక్కడే మృతి చెందగా, సక్రు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం అనంతరం స్థానికులు, బంధువులు మృతదేహంతో హైవేపై రాస్తారోకో నిర్వహించారు. నందిపాడు చౌరస్తాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలను నివారించేందుకు వెంటనే ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.