రేగొండలో యువకుడి దారుణ హత్య ..
- కత్తితో గొంతు కోసి హతమార్చిన దుండగులు..
- వివాహేతర, ఆర్థికపరమైన కారణాలతో హత్య…
రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండల కేంద్రంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35) రేగొండ వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో షాప్ మూసి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు తెలిసింది.

ఈ హత్యకు వివాహేతర సంబంధం కారణమా లేదా ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటన అనంతరం హత్య చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నట్లు సమాచారం.
మృతుడికి భార్య మౌనిక, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. హత్య ఘటనతో రేగొండలో ఉద్రిక్తత నెలకొంది. శనివారం ఉదయం మృతుడి కుటుంబ సభ్యులు రేగొండ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం భూపాలపల్లి ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను విరమింపజేసి, మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
