రాజధాని, అభివృద్ధిపై జగన్ బాధ్యతాయుతంగా మాట్లాడాలి
అమరావతి, ఎకనామిక్ కారిడార్‌పై జగన్ వ్యాఖ్యలు దారుణం..
అభివృద్ధి వికేంద్రీకరణతో ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం..
రాజకీయ లబ్ధి కోసం రాజధాని అంశాన్ని ప్రస్తావించడం సరికాదు..
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలి
జై అమరావతి నినాదంతో రాజధానికి మద్దతు
తిరువూరు శాసనసభ్యుడు కొలకపూడి శ్రీనివాసరావు
తిరువూరు ఆంధ్రప్రభ : రాజధాని అభివృద్ధి అంశాలలో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని తిరువూరు శాసనసభ్యుడు కొలకపూడి శ్రీనివాసరావు సూచించారు. అమరావతి రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, రాజధాని, ఎకనామిక్ కారిడార్ వంటి అంశాలపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో అమలు చేస్తూనే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తూ, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అలాంటి సమయంలో రాజకీయ లబ్ధి కోసం అమరావతి అంశాన్ని పదేపదే ప్రస్తావించడం దురదృష్టకరమని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కొలికపూడి శ్రీనివాసరావు కోరారు. చివరగా “జై అమరావతి” అంటూ రాజధానికి తన మద్దతు ప్రకటించారు.
