జీవం పోసుకుంటున్న వేదాద్రి-కంచల ఎత్తిపోతల పధకం..

రూ.33 లక్షల ఎంపీ నిధులతో పునరుద్ధరణ పనులకు శ్రీకారం
17 వేల ఎకరాలకు సాగునీటి భరోసా కల్పించడమే లక్ష్యం
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరుగునపడిన పథకం
ఎంపీ కేశినేని చిన్ని
2027 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తాం
మంత్రి నిమ్మల రామానాయుడు

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : నందిగామ-జగ్గయ్యపేట ప్రాంత రైతులకు సాగునీటి భరోసా కల్పించే కీలకమైన వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని తన ఎంపీ స్థానికాభివృద్ధి నిధుల నుంచి రూ.33 లక్షలు కేటాయించగా, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కలిసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, గత ఐదేళ్లలో వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురై నిరుపయోగంగా మారిందన్నారు. రైతులు ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రైతుల విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించి ఎంపీ నిధులతో పునరుద్ధరణ పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం రూ.33 లక్షల వ్యయంతో మూడో నంబర్ పంపును తిరిగి పనిచేసే స్థితికి తీసుకురానున్నట్లు చెప్పారు.

ఈ పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సుమారు 17 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, వేలాది మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో వేదాద్రి-కంచల లిఫ్ట్ స్కీం నిర్వహణకు రూ.5.36 కోట్లు వెచ్చించి రైతులకు సాగునీరు అందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో ఈ పథకం పునరుద్ధరణకు రూ.15 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. 2027 ఖరీఫ్ సీజన్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వేదాద్రి-కంచల లిఫ్ట్ స్కీం అభివృద్ధి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మాజీ మంత్రులు దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావు గుర్తుకు వస్తారని ఎంపీ చిన్ని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థలకు పూర్వ వైభవం తీసుకురావడం ద్వారా లక్షలాది మంది రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నందిగామలో త్వరలో ఆయుష్ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నట్లు, జగ్గయ్యపేట-నందిగామ ప్రాంతాలకు కొత్త పరిశ్రమలను తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పోలంపల్లి ప్రాజెక్టు పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ కోటా వీరబాబు, కంచికచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ కోగంటి బాబు, వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకం చైర్మన్ రాటకొండ చంద్రశేఖర్, ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఏపీ ఐడీసీ ఎండీ తిరుమలరావు, నీటి సంఘాల ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.