swami vivekananda | యువతకు దిక్సూచి అయిన మహానుభావుడు..
swami vivekananda | యువతకు దిక్సూచి అయిన మహానుభావుడు..
నేటికీ మార్గదర్శకమే ఆయన సందేశం
నేడు వివేకానందుడి వర్థంతి
swami vivekananda | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నేటి కాలంలో యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పరీక్షల్లో మార్కులు సాధించడమే లక్ష్యంగా మారిన విద్యా విధానం, నైపుణ్యాల కంటే బట్టీ చదువులకే ప్రాధాన్యం పెరగడం, పెరుగుతున్న నిరుద్యోగం, అంతర్జాలం, ఓటీటీలు, సోషల్ మీడియా ప్రభావం, మాదకద్రవ్యాల వ్యసనం వంటి సమస్యలు యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇలాంటి సమయంలో యువతకు మార్గదర్శకుడిగా నిలిచిన మహనీయుడు స్వామి వివేకనందుడు.. నేడు స్వామి వివేకానందుడి వర్థంతి. భారత యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం, సేవా భావాన్ని నింపిన మహనీయుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన చెప్పిన ప్రతి మాటలో ఆలోచన ఉంది.. ప్రతి సందేశంలో ఆచరణ ఉంది.. ప్రతి ప్రసంగంలో యువతను మేల్కొలిపే శక్తి ఉంది…
“లేచి నిలబడండి… మేల్కొనండి… లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకండి” అనే ఆయన పిలుపు నేటికీ కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తోంది. కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన బోధించారు. మనిషిని గొప్పవాడిని చేసేది బాహ్య పరిస్థితులు కాదని, అతని సంకల్పమేనని వివేకానందుడు విశ్వసించారు.
“మనకు కావాల్సింది ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు.. వజ్రంలాంటి సంకల్పం” అని ఆయన చెప్పిన మాటలు యువతలో ధైర్యాన్ని నింపే సందేశంగా నిలిచిపోయాయి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నప్పుడే వ్యక్తి జీవితంలో విజయాలు సాధించగలడని ఆయన వివరించారు.
నేటి యువతలో చాలామంది సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ, మరికొందరు సోషల్ మీడియా, ఓటీటీలు, వ్యసనాలు, మాదకద్రవ్యాల వంటి వాటికి బానిసలవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వివేకానందుడు చెప్పిన క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, లక్ష్యసాధన, మంచి ఆలోచనల విలువ మరింత అవసరమవుతోంది.
వివేకానందుడి దృష్టిలో యువతే దేశ భవిష్యత్తు. యువతలోని అపార శక్తిని సానుకూల దిశగా మలిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన నమ్మారు. విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదని, వ్యక్తిలోని శక్తిని వెలికితీసి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేదే నిజమైన విద్య అని ఆయన చెప్పిన సందేశం నేటి విద్యా వ్యవస్థకు కూడా మార్గదర్శకంగా నిలుస్తోంది.
కాలం మారినా, పరిస్థితులు మారినా, వివేకానందుడి ఆలోచనలు మాత్రం ఎన్నటికీ పాతబడవు. లక్ష్యంపై ఏకాగ్రత, కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం, దేశసేవ అనే నాలుగు విలువలను జీవితంలో ఆచరిస్తే ప్రతి యువకుడు విజేతగా నిలవగలడు. ఆయన వర్థంతి సందర్భంగా ఆయన బోధనలను స్మరించుకోవడం మాత్రమే కాదు, వాటిని జీవితంలో ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి.
