విజిలెన్స్ కమిటీలపై మురికిపూడి ప్రసాద్ విమర్శలు

రాజకీయ పునరావాస కేంద్రాలుగా పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీలు

నిబంధనలు విస్మరించి రాజకీయ ఒత్తిళ్లతో నియామకాలు జరిగాయని ఆరోపణ

నరసరావుపేట, ఆంధ్రప్రభ: పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుల నియామకంలో నిబంధనలు పాటించకుండా రాజకీయ ఒత్తిళ్లకు లోబడి నియామకాలు చేపట్టారని సీఆర్పీఎఫ్‌ఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ ఆరోపించారు.

శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర విజిలెన్స్ కమిటీలలో వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం. 8 ప్రకారం వినియోగదారుల వ్యవహారాలతో సంబంధం లేని వ్యక్తులను కొన్ని జిల్లాల విజిలెన్స్ కమిటీలలో నియమించడం చట్ట స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.

ఈ నియామకాల ద్వారా రాజకీయంగా అవకాశాలు లేని వ్యక్తులకు పదవులు కల్పించినట్లు కనిపిస్తోందని, అయితే పదవులు పొందిన వ్యక్తులపై తమకు ఎలాంటి వ్యక్తిగత వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవకాశం కల్పించి ఉంటే విజిలెన్స్ కమిటీల ఏర్పాటు వెనుక ఉన్న అసలు ఉద్దేశం నెరవేరేదని అభిప్రాయపడ్డారు.

గత నెల 30న విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం.8లో కన్జ్యూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులను నియమించినట్లు, సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్ల సిఫార్సుల మేరకు ఈ నియామకాలు జరిగాయని పేర్కొనడం గమనార్హమని అన్నారు. అయితే నియమితులైన వ్యక్తులు నిజంగా వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులేనా అనే విషయాన్ని ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.8ను పునఃసమీక్షించి, అవసరమైతే ఉపసంహరించుకుని నిబంధనలకు అనుగుణంగా కొత్త నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల సంఘాలు ఏకమై చట్టబద్ధమైన మార్గాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తాయని మురికిపూడి ప్రసాద్ తెలిపారు.