​గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం..

  • ఇ.ఎల్.వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఇ.ఎల్.వి భాస్కర్ ఫౌండేషన్ పనిచేస్తోందని ఆ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్ అన్నారు. మండల పరిధిలోని తూప్రాన్‌పేట, రెడ్డిబావి గ్రామాల్లో ఆయన పర్యటించారు. తూప్రాన్‌పేట గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించిన భాస్కర్ సమస్య శాశ్వత పరిష్కారానికి హామీ ఇచ్చారు. అయ్యప్ప స్వామి సన్నిధానం బోరు నుండి గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న నీటి ట్యాంక్‌కు పైప్‌లైన్ కనెక్షన్ ఏర్పాటు కోసం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బక్కతట్ల రాధిక శ్రీశైలం, ఉప సర్పంచ్ ముద్దం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

​రెడ్డిబావిలో సిసి కెమెరాలు, ఉచిత టైలరింగ్ శిక్షణ

అనంతరం రెడ్డిబావి గ్రామాన్ని సందర్శించిన భాస్కర్ కు సర్పంచ్ నందగిరి వెంకటేష్ ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అందాలన్నదే తమ లక్ష్యమన్నారు. రెడ్డిబావి గ్రామంలో భద్రత నిమిత్తం సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, మహిళల స్వయం ఉపాధి కోసం ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఫౌండేషన్‌ను సంప్రదిస్తే మెరుగైన వైద్యం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక యువత, పెద్దలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.