నాణ్యతగా అభివృద్ధి పనులు
నాణ్యతగా అభివృద్ధి పనులు
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
ప్రజలకు రోజూ సురక్షిత తాగునీరు
పకడ్బందీగా ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియ
అధికారులకు కలెక్టర్ వెంకటేశ్వర్ సూచన
తిరుపతి, ఆంధ్రప్రభ : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ప్రతిరోజూ సురక్షిత తాగునీరు అందించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం అన్ని విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులను ప్రాధాన్యత ఆధారంగా త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి పనిలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు.
డ్రైనేజీల్లో చెత్త తొలగించాలి
డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు ప్రతిరోజూ సురక్షిత తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్, నగరపాలక సంస్థ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)–2026 ప్రక్రియను ప్రాధాన్యతగా తీసుకుని ఓటరు జాబితా మ్యాపింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జి కమిషనర్ శారదాదేవి వివిధ విభాగాల అభివృద్ధి పనుల పురోగతిని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

