స్విమ్స్‌లో ప్రపంచ రక్తపోటు దినోత్సవం

స్విమ్స్‌లో ప్రపంచ రక్తపోటు దినోత్సవం

  • కలిసి కట్టుగా అధిక రక్తపోటును నియంత్రిద్దాం” అంటూ వైద్యుల పిలుపు
  • జీవనశైలి మార్పులతో బీపీ నియంత్రణ సాధ్యమని అవగాహన
  • వ్యాయామం, సమతుల్య ఆహారం, ఉప్పు తగ్గింపు అవసరమని సూచనలు

తిరుపతి హెల్త్, ఆంధ్రప్రభ : తిరుపతి స్విమ్స్ లో శనివారం ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్విమ్స్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి ఓపీడి బ్లాక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు రక్తపోటు నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా. రామ్ మాట్లాడుతూ, స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డా. ఆర్.వి. కుమార్ ఆదేశాల మేరకు ఈ ఏడాది “కంట్రోలింగ్ హైపర్టెన్షన్ టుగెదర్” అనే థీమ్‌తో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్, విభాగాధిపతి డా. వనజాక్షమ్మ మాట్లాడుతూ అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయాలని సూచించారు. ప్రశాంతమైన మనస్తత్వం, సమతుల్య ఆహారం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ తగ్గుతుందని తెలిపారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వరుణ్ రక్తపోటు కారణాలు, లక్షణాలు, గుర్తించే విధానం, నియంత్రణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. డా. ఫర్దీబా మాట్లాడుతూ శారీరక శ్రమ, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండటం ద్వారా అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చన్నారు. డా. వాహిద్ ఖాన్ మాట్లాడుతూ బీపీ నియంత్రణలో ఉంటే స్ట్రోక్, పక్షవాతం వంటి సమస్యలను నివారించవచ్చన్నారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, ఉప్పు తక్కువగా తీసుకోవడం అవసరమని సూచించారు. అధిక బరువు కూడా రక్తపోటుకు కారణమవుతుందని తెలిపారు. డా. అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ పరీక్షించుకోవాలని, ఇంటి వద్ద బీపీ చూసుకునే విధానాన్ని వివరించారు.

డా. నురేష్ కుమార్ అధిక రక్తపోటు సమయంలో కనిపించే లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం నిర్వహించిన ప్యానెల్ చర్చలో డా. వాహిద్ ఖాన్ మోడరేటర్‌గా వ్యవహరించగా, పేషెంట్లు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో రక్తపోటు నియంత్రణపై అవగాహన పెంపొందించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు సాగాలని వైద్యులు పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం పండ్ల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. రోహిత్, డా. ఉపేంద్ర, డా. ధర్మసాయి, డా. విష్ణు ప్రసన్న బాబు, డా. విష్ణు వర్థన్, డా. నరేంద్ర తదితర వైద్యులు పాల్గొన్నారు.

Leave a Reply