ఎస్ ఐ ఆర్ సర్వే పై సర్పంచ్ ప్రత్యేక చొరువ..
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) సర్వే ముమ్మరంగా సాగుతోంది. మండలంలోని దుబ్బగూడ పంచాయతీ సర్పంచ్ మడవి కౌసల్య భీమ్రావు ఈ సర్వేపై ప్రత్యేక చొరవ చూపుతూ స్వయంగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా, ఓటర్ల నమోదు, సవరణలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను కూడా స్వయంగా నింపిస్తూ ప్రజలకు సహకారం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మడవి కౌసల్య భీమ్రావు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పూర్తి వివరాలతో ఫారాలను నింపి లేదా నింపించుకుని బీఎల్ఓలు, రెవెన్యూ అధికారులకు అందజేయాలని కోరారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి అమూల్యమైన రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో ఈ సర్వేలో ప్రజలందరూ చురుకుగా పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
దుబ్బగూడ పంచాయతీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధతో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మడవి భీమ్రావు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
