కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా: గొర్రె కిరణ్
హసన్‌పర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గొర్రె కిరణ్ నియమితులయ్యారు.
జిల్లాలోని పలు మండలాలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్‌లకు నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గొర్రె కిరణ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. కిరణ్ నియామకాన్ని పురస్కరించుకుని స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా గొర్రె కిరణ్ మాట్లాడుతూ.. డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో పాటు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
