పచ్చదనం లేకపోతే భవిష్యత్ ప్రమాదమే..
- సత్తుపల్లి వన మహోత్సవ కార్యక్రమం తనలో జోష్ నింపింది…
- కలెక్టర్ దివాకర్ టిఎస్..
సత్తుపల్లి, ఆంధ్రప్రభ : మొక్కలు నాటడంలో అశోకుడిని అంతా ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు.. ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సత్తుపల్లిలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పచ్చదనం లేనట్లయితే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉందన్నారు.. ప్రతి సంవత్సరం కోటి మొక్కలు నాటే లక్ష్యంతో ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు.. తన సామ్రాజ్యంలో మొక్కలు నాటి పచ్చదనంతో నింపిన అశోకుడు అందరికీ స్ఫూర్తి కావాలన్నారు..
సత్తుపల్లి లో వన మహోత్సవం కార్యక్రమం ఒక పండుగలా సాగిందని అభినందించారు.. అటవీ శాఖ ఉద్యోగుల కృషితో అడవి కూడా పెరుగుతూ వస్తుందన్నారు.. ప్రతి ఒక్కరూ భవిష్యత్తు గురించి ఆలోచించి మొక్కలు నాటాలని కోరారు.. లేనట్లయితే జర్మనీ దేశంలా మారే ప్రమాదం ఉందన్నారు.. మొక్కలు పెంచకపోతే రాబోయే రోజుల్లో ఆక్సిజన్ డబ్బుతో కొనాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.. సత్తుపల్లి శాసన సభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమం జీవితంలో మర్చిపోలేనంత ఆనందం తనలో నింపిందన్నారు..
ఏడేళ్లగా కలెక్టర్ వృత్తిలో కొనసాగుతున్నప్పటికీ ఇంతటి జోష్ నింపిన కార్యక్రమం తాను ఎప్పుడూ చూడలేదన్నారు.. సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించాలని కోరారు.. మొక్క నుంచి పొందుతున్న లాభాలు అన్నీ,ఇన్ని కాదన్నారు.. డీఎఫ్ఓ అనూస్ అగర్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో అటవీ సంపద క్రమేపి పెరుగుతుందన్నారు.. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు.. అడవి పెరగటం వల్ల మనుషులతో పాటు మూగజీవాలకు కూడా చాలా ఉపయోగం ఉంటుందన్నారు..
అనంతరం పలు ప్రదేశాల్లో మొక్కలు నాటి వనహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.. కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు దోమ ఆనంద్, నీరజ ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ ఎండి రెహనా బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత, మండల కమిటీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి,, పట్టణ కమిటీ అధ్యక్షులు గాదె చెన్నారావు, మండల విద్యాశాఖ అధికారి నక్క రాజేశ్వరరావు, ఎంపీడీవో నాగేశ్వరరావు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం జిల్లా కార్యదర్శి నాయుడు వెంకటేశ్వరరావు, మండల కమిటీ అధ్యక్షుడు పసుపులేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..
