అర్హులందరి పేర్లను జాబితాలో నమోదు చేయండి: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్
గోదావరిఖని, ఆంధ్రప్రభ: భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ లో భాగంగా అర్హులందరికీ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. శుక్రవారం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్ ప్రక్రియ నిర్వహిస్తున్న బూత్ లెవెల్ ఇన్చార్జిలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్సింగ్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.
నియోజకవర్గంలో చేపడుతున్న సర్ ప్రక్రియ కార్యక్రమం పురోగతి సాధించాలని అన్నారు. ప్రతి ఒక్కరిలో అవగాహనను పెంపొందించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో విలువైందని, ప్రక్రియకు కావలసిన సమాచార సేకరణలో ప్రజలకు ఇన్చార్జులు అవగాహన కల్పించాలని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ప్రజలంతా కూడా సహకరించాలని మక్కన్ సింగ్ కోరారు.
సమీక్ష సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ సర్ ప్రక్రియ నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ఇన్చార్జిలు అంతా కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నగరంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటు లేని ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించి జాబితాలో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ఓటరు జాబితాలో పేర్లు లేకపోయినా… తప్పులున్న… చిరునామాలో ఎలాంటి మార్పులు ఉన్న సరి చేయాలన్నారు. కొత్తగా ఓటర్ జాబితాలో నమోదు చేసుకునే వారి సమాచారాన్ని స్పష్టంగా పొందుపరచాలన్నారు. అలాగే అర్హత లేని వారి పేర్లు జాబితాలో ఉంటే సమగ్రంగా పరిశీలన చేసి తొలగించాలన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందించాలని అన్నారు.
ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తు సక్రమంగా పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు సేవాభావంతో పనిచేస్తే ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పోరేటర్లు నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల, గ్రామాల ఇంచార్జులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
