తెలుగు వెండితెర చక్రవర్తికి ఏలూరులో అశ్రు నివాళి…
ఏలూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ : తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు 108వ జయంతి వేడుకలు శుక్రవారం నాడు ఏలూరులో అత్యంత ఘనంగా జరిగాయి. మేనమామ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) భావోద్వేగానికి గురయ్యారు. పవర్‌పేటలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటి, ఎస్వీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించారు. తాత జయంతిలో పాల్గొన్న ఎస్వీ రంగారావు మనవడు ఎస్‌ఎల్‌వీఎస్ రంగారావు మాట్లాడుతూ, “మా తాతగారు ఏలూరు బిడ్డగా పుట్టి ప్రపంచ సినిమాకే వన్నె తెచ్చారు.
మా కుటుంబంపై ఏలూరు ప్రజలు చూపిస్తున్న అభిమానం మరువలేనిది” అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రావణబ్రహ్మ, ఘటోత్కచుడు, కీచకుడు… పాత్ర ఏదైనా అందులో జీవించిన ఏకైక నటుడు మా మేనమామ. ‘మాయాబజార్’లో ఆయన ఘటోత్కచుడు లేకపోతే ఆ సినిమాకే వెలితి. నంది అవార్డులు, రాష్ట్రపతి పురస్కారాలు వచ్చినా ఏలూరు వీధుల్లో సాదాసీదాగా తిరిగిన గొప్ప మనిషి. ఆయన వారసుడిగా పుట్టడం నా అదృష్టం” అంటూ బడేటి చంటి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, సెక్రటరీ రెడ్డి నాగరాజు, బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, క్లస్టర్ ఇంచార్జ్ మల్లెపు రాము, సీనియర్ నాయకులు ఆర్నేపల్లి తిరుపతిరావు, కందుల రమేష్ సహా పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, అభిమానులు హాజరయ్యారు.
