అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి..

  • పీ.హెచ్‌.సీ లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి..
  • జూలై 15 లోపు ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ పనులు పూర్తి చేయాలి..
  • పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

ఓదెల, ఆంధ్రప్రభ : ఓదెల మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం ఓదెల మండలంలో కొలనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొమిర గ్రామంలో భూభారతి దరఖాస్తుల వ్యవసాయ భూముల క్షేత్రస్థాయి పరిశీలన, నూతన తహసీల్దార్ కార్యాలయం, నిరుపయోగంగా ఉన్న ఐకేపీ భవనం, ఎంపీడీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ గృహాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, కొలనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు, సిబ్బంది విధి సమయాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని రకాల మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స అందించాలని, ఆరోగ్య సేవలపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం కొమిర గ్రామంలో భూభారతి ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన రైతుల దరఖాస్తులను నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని, భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు.

ఓదెలలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్నిపరిశీలించిన కలెక్టర్, పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న పనులను వెంటనే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. నిరుపయోగంగా ఉన్న ఐకేపీ భవనాన్ని పునరుద్ధరించి, అవసరమైన మరమ్మత్తులు చేపట్టి కోర్టు భవనంగా వినియోగించే విధంగా తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎం.పీ.డీ.వో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ మండలంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను 10 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర అభివృద్ధి పనులన్నింటినీ ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

తహసీల్దార్ కార్యాలయాన్నిఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, భూభారతి, మీ సేవ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ఎలాంటి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఓదెల మండల కేంద్రంలోని ఇందిరమ్మ గృహాలను పరిశీలించారు. లబ్ధిదారులు నూతి సరోజ, నూతి రజిత నిర్మించుకున్న 2 ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.

ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో బిల్లులు అందడంతో సొంత ఇల్లు నిర్మించుకోవడం ఆనందంగా ఉందని లబ్ధిదారులు కలెక్టర్‌కు తెలిపారు. మండలంలో మంజూరైన ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేసి, అన్ని ఇళ్లను జులై 15 వరకు పూర్తి చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పూర్తయిన ఇళ్లలో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు నిర్వహించి ఆత్మవిశ్వాసంతో జీవనం సాగించేలా అవసరమైన సహకారం అందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట ఓదెల తాహసిల్దార్ వనజ, ఎంపీడీవో అనిల్ రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.