Telangana Politics | జూపల్లికి హరీశ్ ప్రతి సవాల్

Telangana Politics | జూపల్లికి హరీశ్ ప్రతి సవాల్

సెల్ఫ్‌గోలైన‌ మంత్రులు
జూప‌ల్లి తీరు పూట‌కో స‌వ‌ల్‌.. రోజుకో అడ్ర‌స్‌లా ఉంది
తెలంగాణ భ‌వ‌న్‌కు వ‌స్తాన‌ని జూప‌ల్లి తోక ముడిచాడు.
‘సవాళ్లు విసిరి వెనక్కి తగ్గారు..
జూపల్లి రాజీనామాకు సిద్ధమా?’ అని ప్రశ్నించిన హరీశ్‌రావు
రాష్ట్ర అప్పుల లెక్కలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రం
అప్పులపై సీఎం రేవంత్, మంత్రి జూపల్లి వేర్వేరు లెక్కలు చెబుతున్నారని ఆరోపణ

Telangana Politics | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అప్పుల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతమైంది. రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. జూపల్లి చేస్తున్న వ్యాఖ్యలు రోజుకో సవాల్‌, పూటకో మాట, రోజుకో అడ్రస్‌లా మారిపోయాయని విమర్శించిన ఆయన, సవాల్ చేసి చివరకు వెనక్కి తగ్గారని ఆరోపించారు.

గురువారం తెలంగాణభవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, దేవీప్రసాద్‌, రామచంద్రునాయక్‌, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

హరీశ్‌రావు మాట్లాడుతూ.. మొదట తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పిన జూపల్లి చివరకు “తోక ముడిచారని” విమర్శించారు. అనంతరం గన్‌పార్క్ వద్దకు రావాలని చెప్పడంతో అక్కడికీ వెళ్లేందుకు తాము సిద్ధమైనప్పటికీ, పోలీసులు తమను అడ్డుకున్నారని తెలిపారు. “మంగళాలు గోల్ కొడతామనుకుని చివరకు సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు” అంటూ జూపల్లి తీరును ఎద్దేవా చేశారు.

మంత్రి జూపల్లి తనకు రాసిన లేఖ అందిందని పేర్కొన్న హరీశ్‌రావు, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.77 లక్షల కోట్లుగా పేర్కొన్నారని చెప్పారు. అయితే, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) లెక్కల ప్రకారం ఆ అప్పులు రూ.1.86 లక్షల కోట్లుగా ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఐదు నెలల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర అప్పులు రూ.3.47 లక్షల కోట్లుగా ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్ర అప్పులపై సీఎం ఒక లెక్క, మంత్రి మరో లెక్క చెబుతున్నారని ఆరోపించారు.

జూపల్లి కృష్ణారావు చేసిన ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని హరీశ్‌రావు అన్నారు. “చీమూ నెత్తురు ఉంటే జూపల్లి తన పదవికి రాజీనామా చేయాలి. పాలమూరు పౌరుషం ఉంటే తన సవాల్‌కు కట్టుబడి ఉండాలి” అని సవాల్ విసిరారు. ప్రభుత్వం సక్రమంగా నడిపే సామర్థ్యం లేక ప్రతిపక్షంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వ అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి జూపల్లి కృష్ణారావుకు పంపిస్తానని హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర అప్పుల లెక్కలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ వాగ్వాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.