ఏపీని అంతర్జాతీయ సినీ చిత్రీకరణ హబ్‌గా తీర్చిదిద్దుతాం..
సుమన్ కీలక వ్యాఖ్యలు
నెల్లూరు నుంచి విశాఖ వరకు ప్రపంచ స్థాయి షూటింగ్ స్పాట్లే లక్ష్యం.. స్థానికులకు భారీ ఉపాధి అవకాశాలు
తిరుమల, ఆంధ్రప్రభ: ప్రముఖ సినీ నటుడు సుమన్ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో సత్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సుమన్ మాట్లాడుతూ ప్రస్తుతం “ధర్మస్థలం” నియోజకవర్గం, “విశాఖ” వెబ్ సిరీస్‌లతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. దేవుడి దయతో కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ వరుస చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నానని చెప్పారు.
సినీ పరిశ్రమలో తన ప్రయాణానికి 48 సంవత్సరాలు పూర్తయ్యాయని, మరో రెండేళ్లలో 50 సంవత్సరాల స్వర్ణోత్సవాన్ని జరుపుకోనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ఫిలిం, థియేటర్ అండ్ టీవీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో డైరెక్టర్లలో ఒకరిగా అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ సిఫార్సుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు ఈ బాధ్యత అప్పగించారని తెలిపారు. ఈ కమిటీకి భారత్ భూషణ్ చైర్మన్‌గా ఉండగా, మొత్తం 14 మంది సభ్యులు ఉన్నారని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ సినీ చిత్రీకరణ కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సుమన్ అన్నారు. నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం, గోదావరి పరివాహక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి షూటింగ్ స్పాట్లుగా తీర్చిదిద్దే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
కేవలం సినిమా చిత్రీకరణలకే కాకుండా సమావేశాలు, వివాహాలు, ఇతర భారీ కార్యక్రమాలు నిర్వహించేలా అత్యాధునిక స్టూడియోలను నిర్మించే యోచన ఉందన్నారు. అలాగే ఎయిర్ కనెక్టివిటీతో కూడిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక కళాకారులు, టెక్నీషియన్లు, దర్శకులు, నిర్మాతలకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారని సుమన్ తెలిపారు.
