ఆర్టీసీ కాలనీలో అగ్నిప్రమాదం.. షార్ట్‌సర్క్యూట్‌తో రెండు విద్యుత్ మీటర్లు దగ్ధం

పెనమలూరు, ఆంధ్రప్రభ: పెనమలూరు మండలంలోని ఆర్టీసీ కాలనీలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లింగం రేష్మ నివాసంలో ఉన్న విద్యుత్ మీటర్ల వద్ద షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.

మంటలు వేగంగా వ్యాపించడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, అగ్నిమాపక మరియు విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అప్రమత్తంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో రెండు విద్యుత్ మీటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

అయితే అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.