సింగరేణి అధికారుల పే అప్గ్రేడ్ వెంటనే అమలు చేయాలి: పుట్ట మధుకర్
గోదావరిఖని, ఆంధ్రప్రభ: సింగరేణి అధికారుల పే అప్గ్రేడ్, పీఆర్పీ బకాయిలను వెంటనే అమలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. గురువారం గోదావరిఖనిలోని సింగరేణి జీఎం కార్యాలయం వద్ద అధికారుల సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలను టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తితో కలిసి సందర్శించి సంఘీభావం తెలిపారు. 137 ఏళ్ల సింగరేణి చరిత్రలో అధికారులు తమ హక్కుల కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
సింగరేణి గత రెండేళ్లలో సాధించిన లాభాల్లో రూ.6 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించిన ఆయన, అధికారులకు చెల్లించాల్సిన రూ.230 కోట్ల పీఆర్పీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే అధికారుల పోరాటానికి బీఆర్ఎస్, టీబీజీకేఎస్ పూర్తి మద్దతు ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.
