కానుకుంటలో మహిళా సంఘాలకు సోషల్ ఆడిట్
- 34 మహిళా సంఘాల పనితీరుపై సమగ్ర సమీక్ష
- మహిళల ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన కల్పించిన అధికారులు
గుమ్మడిదల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల పనితీరును మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో రాష్ట్రంలోనే తొలి పైలట్ సోషల్ ఆడిట్ విజయవంతంగా నిర్వహించారు. సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా సోషల్ ఆడిట్ చేపడుతున్నారు.

ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల, పటాన్చెరు మండలాలను ఎంపిక చేశారు. కానుకుంట-2 గ్రామైక్య సంఘం పరిధిలోని 34 మహిళా సంఘాలకు సోషల్ ఆడిట్ నిర్వహించి, సంఘాల పనితీరు, ఆర్థిక లావాదేవీలు, పొదుపులు, అంతర్గత రుణాల నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. జూన్ 25 నుంచి జూలై 1 వరకు కొనసాగిన ఈ సోషల్ ఆడిట్ అనంతరం మహిళా గ్రామసభ నిర్వహించి, ఆడిట్లో గుర్తించిన అంశాలను సంఘ సభ్యులకు అధికారులు వివరించారు.
ముఖ్యంగా అంతర్గత రుణాలకు సంబంధించి చాలామంది సభ్యులు అసలు మొత్తాన్ని చెల్లించకుండా కేవలం వడ్డీలను మాత్రమే చెల్లిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, దీనివల్ల కలిగే ఇబ్బందులను వివరించి అవగాహన కల్పించారు. దీనిపై స్పందించిన సంఘ సభ్యులు తమ రుణాల అసలు మొత్తాన్ని కూడా క్రమం తప్పకుండా విడతల వారీగా చెల్లిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ ఉషారాణి మాట్లాడుతూ, కానుకుంట మహిళా సంఘాల పనితీరు ఆదర్శవంతంగా ఉందని ప్రశంసించారు.
సోషల్ ఆడిట్ ద్వారా మహిళా సంఘాల్లో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ మరింత పెంపొందుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి సీఆర్డీ డిప్యూటీ డైరెక్టర్ ఉషారాణి, రాష్ట్ర సెర్ప్ కార్యాలయానికి చెందిన జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ రాజేష్, జిల్లా డీపీఎం జాన్ కెనడీ, ఏపీఎం నరేందర్, సీసీ వరలక్ష్మి, వీఓఏ మహేశ్వరి, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు యశోద, పూజతో పాటు మహిళా సంఘాల సభ్యులు, సోషల్ ఆడిట్ బృందం సభ్యులు పాల్గొన్నారు.
