అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
కేసముద్రం, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురం గ్రామంలో వెలసిన శ్రీ భూనీల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు గురువారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
హేమంతాచార్యుల అర్చక బృందం, ఆలయ అర్చకులు వినయ్ శర్మ ఆధ్వర్యంలో సేవాకాలం, శాత్తుమురై, ధ్వజారోహణం, సంతానార్థులకు గరుడ ప్రసాదం, అగ్ని ప్రతిష్ఠ, చతుస్థానార్చన, వేద విన్నపాలు, నిత్య పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, బేరి పూజ, దేవతా ఆహ్వానం, ఎదుర్కోలు ఉత్సవం, వేద విన్నపాలు, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
శుక్రవారం మూడో రోజు శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కనులపండువగా జరగనుంది. శ్రవణ నక్షత్రంలో నిర్వహించే ఈ దివ్య కళ్యాణం కుటుంబ సౌఖ్యం, ఐకమత్యం, సంతానాభివృద్ధి, ధర్మనిష్ఠను ప్రసాదిస్తుందని అర్చకులు తెలిపారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీపెరంబుదూరు వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి వోలం రాజు, ఆలయ కమిటీ అధ్యక్షుడు వోలం మురళీ, ప్రధాన కార్యదర్శి బచ్చు పరమేశ్వర్, కోశాధికారి కోయగూరి యాకూబ్ రెడ్డి, కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు.
