ఏటూరునాగారంలో లిక్విడ్ గంజాయి పట్టివేత
ఏటూరునాగారంలో లిక్విడ్ గంజాయి పట్టివేత
ఇద్దరు నిందితులు అరెస్ట్..
రూ.6.25 లక్షల విలువైన మత్తు పదార్థం స్వాధీనం
ఏటూరునాగారం, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హషీష్ ఆయిల్ (లిక్విడ్ గంజాయి) పట్టుబడింది. జీడివాగు వద్ద పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 526 గ్రాముల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.6.25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఏటూరునాగారం సీఐ ఎ. శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎస్సై బి. మహేష్ సిబ్బందితో కలిసి జీడివాగు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై హషీష్ ఆయిల్‌ను తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఈ మత్తు పదార్థాన్ని మహారాష్ట్రలోని సిరోంచ ప్రాంతానికి తరలిస్తున్నట్లు గుర్తించారు.
అరెస్టయిన వారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నల్లగట్ల సురేంద్ర కుమార్ (30), బండ్ల సాయి (28)గా పోలీసులు గుర్తించారు. విచారణలో ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజు నాయక్ అనే వ్యక్తి వద్ద నుంచి హషీష్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి 526 గ్రాముల హషీష్ ఆయిల్, ఒక ద్విచక్రవాహనం, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
