ప్రభుత్వ పాఠశాలల్లో ఇక టీచర్లకూ ఉచిత భోజన సౌకర్యం..

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులతో పాటు అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి కూడా విద్యార్థులతో కలిసి భోజనం అందించనున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతపై మరింత సమర్థవంతమైన పర్యవేక్షణ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భోజనం చేయడం వల్ల పాఠశాలల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడటంతో పాటు, అందించే ఆహారం నాణ్యతను నిరంతరం పరిశీలించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.