ఈ ఒక్కటి చేయకుంటే మీ ఓటు గల్లంతే!

  • ​చౌటుప్పల్ తహసీల్దార్ వీరాబాయి హెచ్చరిక

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : “మాకు ఆల్రెడీ ఓటర్ ఐ=డీ కార్డు ఉంది కదా… గత ఎన్నికల్లో ఓటు వేశాం కదా… ఇప్పుడు మాకేం కాదులే” అని నిర్లక్ష్యంగా ఉంటే మీ ఓటు గల్లంతవడం ఖాయమని చౌటుప్పల్ మండల తహసీల్దార్ వీరాబాయి హెచ్చరించారు. సర్ – 2026 (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ పట్టణంలో ఆమె ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు అవగాహన కల్పించారు.

​ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓ) ప్రతి ఇంటికీ వచ్చి ‘ఎన్యూమరేషన్ ఫారం’ అందజేస్తున్నారని తెలిపారు. ఓటర్లు ఈ క్రింది నియమాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ​ఫారం నింపడం తప్పనిసరి బీఎల్ఓలు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపాలి, నింపిన ఫారంపై ఓటరు యొక్క తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను తప్పకుండా అతికించాలి, అలా నింపిన, ఫోటో అతికించిన ఫారాన్ని తిరిగి మీ గ్రామ లేదా వార్డు బీఎల్ఓలకే అందజేయాలి.

గతంలో ఓటు వేసిన వారైనా సరే, ఈ సరికొత్త ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వకపోతే కొత్త ఓటరు జాబితాలో మీ పేరు నమోదు కాదు. అంటే మీ ఓటు హక్కును కోల్పోయినట్లేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి, చౌటుప్పల్ మండల పరిధిలోని ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, బీఎల్ఓలు వచ్చే సమయంలో ఇంట్లోనే ఉండి, ఫారాలు నింపి ఇచ్చి మీ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తహశీల్దార్ వీరాబాయి కోరారు. ఆమె వెంట మండల ఆర్ ఐ గుత్తా వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ దేప రమ్య రాజు, రేషన్ డీలర్ సింగిరెడ్డి రజిత శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.