నాగర్‌కర్నూల్ జిల్లాకు రూ.423 కోట్ల రైతు భరోసా

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: రైతు భరోసా పథకం కింద నాగర్‌కర్నూల్ జిల్లాలో 3 లక్షల 43 వేల 604 మంది రైతులకు రూ.423 కోట్ల నిధులు విడుదల కానున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. ఈ నిధులు నేటి నుంచి ప్రారంభమై రానున్న తొమ్మిది రోజుల పాటు అర్హత, భూ విస్తీర్ణం ఆధారంగా దశలవారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని వెల్లడించారు.

వర్షాకాలం సాగుకు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక నుంచి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులను విడుదల చేశారు.ఈ కార్యక్రమాన్ని నాగర్‌కర్నూల్ మండలంలోని మంతటి రైతు వేదికలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రైతులు తమ బ్యాంకు ఖాతాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని సూచించారు. నిధుల జమకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఎదురైతే సమీప వ్యవసాయ విస్తరణ అధికారి, మండల వ్యవసాయ అధికారి లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు.