విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి..

  • ఫీజు బకాయి వెంటనే విడుదల చేయాలి
  • బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ర్యాలీ

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పడిన ఫీజు నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి ఐబీ నుంచి విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తర్వాత విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ప్రభు గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బకాయి ఉన్న సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఫీజు బకాయిల కారణంగా కళాశాలలు విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోవడంతో పాటు పలువురు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ముత్యాన్ని శేఖర్, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్, మహేందర్, అధికార ప్రతినిధి కుమ్మరి సాయిలు, కోశాధికారి కె. సుధాకర్ గౌడ్, సలహాదారు కరణ్‌జిత్ సింగ్, కార్యదర్శులు శ్రీనివాస్, ప్రవీణ్, గౌలిశ్వర్, విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాయి భాష, మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వడ్ల లత, అధికార ప్రతినిధి మంగ గౌడ్, కార్యదర్శి వీరమణి నాయి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనూప్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ పటేల్, జిల్లా ఉపాధ్యక్షులు అభినవ్, మహేష్ యాదవ్, హనుమంతు నాయి, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.