కార్మిక శాఖ లో నిధులు దారి మళ్లింపు ఆపాలి..

  • భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కొండ ఉప్పలయ్య

మరిపెడ, ఆంధ్రప్రభ : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తూ కార్మిక సంక్షేమ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ అనుబంధం) మండల అధ్యక్షుడు కొండ ఉప్పలయ్య ఆరోపించారు.

సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం మరిపెడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కొండపల్లి కృష్ణవేణికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కొండ ఉప్పలయ్య మాట్లాడుతూ, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో విఫలమయ్యాయని విమర్శించారు.

భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత, పాక్షిక అంగవైకల్య పథకాలను జీవో నెం.12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించడం కార్మికులకు అన్యాయమని అన్నారు. రూ.346.36 కోట్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కేటాయించడం ప్రజాపాలనకు విరుద్ధమని విమర్శించారు.

సీఎస్సీ హెల్త్ చెకప్‌లను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల పేరుతో అధిక ప్రీమియాలు చెల్లించడం వల్ల సంక్షేమ బోర్డు నిధులు క్రమంగా తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే హెల్త్ చెకప్‌ల పేరుతో భారీ మొత్తంలో నిధులు ఖర్చయ్యాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి యాదగిరి, కే. రాంబాబు, కే. వెంకన్న, బిక్షం, సైదులు, రాములు, వాసు, వెంకన్న, బిక్కు, ముత్తిలింగం, వెంకట్, రాములు, ఎల్లయ్య, చిరంజీవి, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.