ఏఐ, క్లౌడ్, డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్..
- ఎయిర్‌టెల్‌కు రెండో కేంద్రంగా హైదరాబాద్..
- తెలంగాణలో డిజిటల్ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్..
- ఎయిర్‌టెల్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ (డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ) బోధి పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలను ముఖ్యమంత్రి సునీల్ మిట్టల్‌కు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని, నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) అభివృద్ధి చేస్తున్నామని, పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునికీకరిస్తున్నామని వెల్లడించారు.
చందన్వెల్లిలో ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని సునీల్ మిట్టల్‌ను ముఖ్యమంత్రి కోరారు. అంతేకాకుండా తెలంగాణలో మరింత భారీ స్థాయిలో సమగ్ర డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మౌలిక సదుపాయాల క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
హైదరాబాద్‌ను ఎయిర్‌టెల్‌కు డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాల ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. భవిష్యత్ పెట్టుబడులు, సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసేందుకు సంస్థ తరఫున ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేయాలని కూడా సూచించారు.
సునీల్ భారతి మిట్టల్ స్పందిస్తూ, భారతి ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాద్‌ను ఎయిర్‌టెల్‌కు రెండో ప్రధాన కార్యాలయంగా భావిస్తున్నామని, రాష్ట్రంలో డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు ముందుకు వస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంపై కూడా ఆసక్తి వ్యక్తం చేశారు.

