సర్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలి..
- ఓటర్ జాబితా సవరణ(SIR) కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి పొన్నం..
- బిఎల్ఓలకి పలు కీలక సూచన చేసిన పొన్నం..
- ప్రతి ఓటు కీలకమైనది..
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా బీఎల్ఓలు, బీఎల్ఏలతో మాట్లాడిన మంత్రి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరుకు అవకాశం కల్పించేలా ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజలతో సమావేశమైన మంత్రి సూరారం గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, ప్రాధాన్యత ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎన్. వెంకటేష్, తహసీల్దార్ ప్రసాదరావు, స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
