నెట్నూర్లో మినీ కల్వర్టులు, రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తాం
- సర్పంచ్ మడవి లక్ష్మణ్
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని నెట్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో అవసరమైన చోట మినీ కల్వర్టులు, మినీ వంతెనలు, గ్రావెల్, సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని నెట్నూర్ సర్పంచ్ మడవి లక్ష్మణ్ తెలిపారు.
మంగళవారం ఆయన గ్రామపంచాయతీ పరిధిలోని చెల్కగూడకు వెళ్లే చిన్నవాగు, వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పలు రోడ్లు కోతకు గురై గుంతలు ఏర్పడినట్లు గుర్తించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో సుమారు 70 ఇళ్లు ఉండగా, చిన్నవాగు కారణంగా వర్షాకాలంలో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులతో పాటు మినీ వంతెనలు, కల్వర్టుల నిర్మాణం కోసం సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
అలాగే ఈ సమస్యను మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా నిధులు మంజూరయ్యేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
