రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించాలి

ఊట్కూర్, ఆంధ్రప్రభ: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు ఎలాంటి కొరత లేకుండా సకాలంలో అందుబాటులో ఉంచాలని నారాయణపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ ఎరువులు, విత్తనాల డీలర్లను ఆదేశించారు. మంగళవారం ఊట్కూర్ మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన నిల్వలు, విక్రయాల రికార్డులు, లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, ఈపీఓఎస్ యంత్రాల పనితీరును పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించాలని, రైతులకు తప్పనిసరిగా బిల్లులు అందజేయడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులనే విక్రయించాలని సూచించారు.

ఈపీఓఎస్ యంత్రాల్లో నమోదయ్యే డిజిటల్ స్టాక్‌కు దుకాణాల్లో ఉన్న ఫిజికల్ స్టాక్ పూర్తిగా సరిపోలాలని, ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదని హెచ్చరించారు. ప్రతి లావాదేవీని ఈపీఓఎస్ ద్వారా నమోదు చేసి రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, రైతులు అవసరానికి అనుగుణంగా మాత్రమే ఎరువులు వినియోగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డి పాల్గొన్నారు.