ప్రజల గడపకే పాలన…

  • సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్..
  • సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలి.
  • అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు
  • రెడ్డిగూడెం ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..
  • రెవెన్యూ, పోలీసు, విద్యుత్, సంక్షేమ శాఖల సమస్యలపై వినతులు వెల్లువ

రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : ప్రజల వద్దకే పాలనను చేర్చి వారి సమస్యలకు వేగంగా పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మంగళవారం రెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించి, ఒక్కో సమస్యను శ్రద్ధగా పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో ఏ శాఖా అలసత్వం ప్రదర్శించినా సహించబోమని స్పష్టం చేశారు. సమస్యలను కేవలం నమోదు చేయడమే కాకుండా వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

తక్షణం పరిష్కరించలేని సమస్యల విషయంలో కారణాలను ప్రజలకు పారదర్శకంగా వివరించాలని సూచించారు. ప్రజాస్వామ్య పాలనలో ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడం ప్రజా ప్రతినిధులు, అధికారుల బాధ్యత అని అన్నారు.

ప్రజాదర్బార్‌లో రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, విద్యుత్, సంక్షేమ పథకాలు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలతో పాటు పలు శాఖలకు సంబంధించిన వినతిపత్రాలు పెద్ద సంఖ్యలో అందాయి. సంబంధిత శాఖల అధికారులు వాటిని నమోదు చేసి, త్వరితగతిన పరిష్కరించే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.