మువ్వన్నెల రెపరెపలు.. ఎల్కతుర్తిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఎల్కతుర్తి మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, పాఠశాలలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ పతాకాలను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నరసింహారావు, సీఐ కార్యాలయంలో పులి రమేష్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో విజయ్‌కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి రాజశేఖర్, రైతు వేదికలో వ్యవసాయ అధికారి రాజ్‌కుమార్, మండల సమాఖ్య కార్యాలయంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వర్ణలత జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. గ్రామాల్లో సర్పంచులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, కుల సంఘాలు, యువజన సంఘాల అధ్యక్షులు జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. జాతీయ నాయకుల వేషధారణలో విద్యార్థులు అలరించారు. నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
