పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి..

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
సంక్షేమం–అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రం ప్రగతి
కార్యకర్తలే పార్టీకి అసలైన బలం

విజయవాడ, ఆంధ్రప్రభ: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్, యూనిట్‌ల శిక్షణా తరగతుల కార్యక్రమంలో టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం–అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తోందని.. ప్రతి బూత్‌లో పార్టీని మరింత పటిష్టం చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పార్టీ, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ప్రత్యర్థి పార్టీల అసత్య ప్రచారాన్ని వాస్తవాలతో సమర్థంగా తిప్పికొడుతూ, సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించి ప్రభుత్వ మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయిలో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కోరారు..తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, వారి కష్టానికి గుర్తింపు, సంక్షేమానికి భరోసా కల్పించే పార్టీ తెలుగుదేశం మాత్రమేనని దేవినేని ఉమా పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.