ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ‘కలెక్టర్’ చేసిన అధికారులు!
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఫ్లెక్సీలో ఫొటో, పేరు తారుమారు
కలెక్టర్ ఫొటో స్థానంలో మంత్రి ఫొటో.. అధికారుల తీరుపై విమర్శలు
ఫ్లెక్సీ చూసి నవ్వుకున్న జనం.. పర్యవేక్షణపై ప్రశ్నలు
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: అధికారుల అత్యుత్సాహమో.. నిర్లక్ష్యమో తెలియదు కానీ ఓ మంత్రి ఏకంగా జిల్లా కలెక్టర్ అయిపోయారు! జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫొటోను ఉంచి.. దాని కింద జిల్లా కలెక్టర్ పేరు ముద్రించడం చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కలెక్టర్ ఫొటో ఉండాల్సిన స్థానంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చిత్రాన్ని ఉంచడంతో కార్యక్రమానికి హాజరైన వారు అవాక్కయ్యారు.

మంత్రి ఫొటో.. కలెక్టర్ పేరు!
ఫ్లెక్సీని రూపొందించిన అధికారులు కనీసం ముద్రణకు ముందైనా పరిశీలించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పౌరసరఫరాల శాఖకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆయన ఫొటో ఉండటంలో తప్పులేదు. అయితే కలెక్టర్ పేరుకు మంత్రి ఫొటోను జత చేయడం అధికారుల పనితీరుపై విమర్శలకు తావిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫ్లెక్సీ చూసి నవ్వుకున్న జనం
జిల్లా స్థాయి కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీని కూడా సరిగా పరిశీలించకుండా ఏర్పాటు చేయడంపై పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు విస్మయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కార్యక్రమానికి వచ్చిన పలువురు ఫ్లెక్సీని చూసి నవ్వుకోవడం కనిపించింది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార సామగ్రి విషయంలోనైనా అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
‘ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఐఏఎస్ అయితే ఇలా ఉండేదేమో!’
ఈ ఫ్లెక్సీని చూసిన కొందరు.. “అధికారుల పుణ్యమా అని ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఐఏఎస్‌గా మార్చేశారు.. ఏకంగా జిల్లా కలెక్టర్ పదవి కూడా ఇచ్చేశారు!” అంటూ సెటైర్లు వేసుకున్నారు. చిన్నపాటి ముద్రణా పొరపాటే అయినప్పటికీ జిల్లా స్థాయి అధికారుల సమన్వయం, పర్యవేక్షణపై మాత్రం ఈ ఘటన ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
