స‌మ‌ష్టి కృషితో జిల్లాను నెం.1గా నిలుపుదాం…

మ‌హ‌నీయుల స్ఫూర్తితో మ‌రింత అభివృద్ధి వైపు అడుగులేద్దాం
విక‌సిత్ భార‌త్‌, స్వ‌ర్ణాంధ్ర ఆశ‌యాల‌కు అనుగుణంగా కృషిచేద్దాం
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
క‌లెక్ట‌రేట్‌లో ఘ‌నంగా 80వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు


(విజయవాడ, ఆంధ్రప్రభ) : ఎన్‌టీఆర్ జిల్లాను అభివృద్ధి, సంక్షేమం, ప్రజాసేవలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్ర‌తిఒక్క‌రూ సమష్టిగా కృషిచేద్దామ‌ని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలు, వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దామ‌ని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతిపిత మ‌హాత్మాగాంధీ చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి నివాళులర్పించారు.

ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… స్వాతంత్ర్యం మనకు కేవలం హక్కులను మాత్రమే కాకుండా బాధ్యతలను కూడా అందించిందన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన స్వ‌ర్ణాంధ్ర–2047 విజన్‌కు అనుగుణంగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పాలన, పారదర్శకమైన సేవలు అందించడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతులు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన తదితర రంగాల కీల‌క ప్ర‌గ‌తి సూచిక‌ల్లో మంచి పురోగ‌తి సాధించామ‌ని.. ఈ స్ఫూర్తితో మ‌రింత పురోగతికి క‌లిసిక‌ట్లుగా కృషిచేద్దామ‌న్నారు.

నా సంకల్పం… నా దేశం కోసం.. స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిస్తూ మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి అందరం కలిసి కృషి చేద్దామని కలెక్టర్ ల‌క్ష్మీశ‌ ఆకాంక్షించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీన‌ర‌సింహం, క‌లెక్ట‌రేట్ వివిధ సెక్ష‌న్ల సూప‌రింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.