నేడు ఏపీఎల్ ఫైనల్ ఫైట్

టైటిల్ కోసం భీమవరం-సింహాద్రి అమీతుమీ
ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్..
మ్యాచ్ వీక్షించనున్న ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాద్ (చిన్ని)
రాత్రి 7 గంటలకు మంగళగిరి ఏసీఏ స్టేడియంలో
స్టేడియం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు..
భారీగా తరలిరానున్న క్రికెట్ అభిమానులు…

ఆంధ్రప్రభ విజయవాడ: ఎంతో ఉత్కంఠంగా ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మంగళవారం రాత్రి 7 గంటలకు జరిగే టైటిల్ సమరంలో భీమవరం బుల్స్ , సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లు తలపడనున్నాయి. వారం రోజులుగా అభిమానులను ఉర్రూతలూగించిన టోర్నమెంట్‌కు నేటి ఫైనల్‌తో తెరపడనుంది.

ముఖ్యఅతిథిగా మంత్రి లోకేష్..

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు రాష్ట్ర ఐటీ, విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాద్ (చిన్ని) కూడా మ్యాచ్‌ను వీక్షించనున్నారు. విజేత జట్టుకు ట్రోఫీ ప్రదానం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. టోర్నమెంట్ ప్రారంభం నుంచి మంగళగిరి స్టేడియానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో విజయవాడ, విశాఖపట్నం, భీమవరం, గుంటూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలివస్తున్నారు. అభిమానుల కేరింతల మధ్య ఉత్కంఠభరిత పోరు సాగనుందని నిర్వాహకులు భావిస్తున్నారు. భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని స్టేడియం పరిసరాల్లో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రేక్షకుల ప్రవేశం, భద్రతా తనిఖీలకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

టైటిల్ పోరు కోసం….

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ దశ నుంచి నిలకడైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకున్న భీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. దీంతో ఏపీఎల్-2026 ఛాంపియన్‌గా ఏ జట్టు నిలుస్తుందనే ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.