Telangana Weather | తెలంగాణలో వర్షాలపై కొనసాగుతున్న అనిశ్చితి

Telangana Weather | తెలంగాణలో వర్షాలపై కొనసాగుతున్న అనిశ్చితి

Telangana Weather | నైరుతి రుతుపవనాలు బలహీనమే..
లోటు వర్షాలతో రైతుల ఆందోళన
ఎల్‌నినో ప్రభావం.. కరువు ముప్పుపై నిపుణుల హెచ్చరిక
ఎల్లో అలర్ట్ జారీ.. నీటి వినియోగంపై ప్రభుత్వ అప్రమత్తత

Telangana Weather | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో వాతావరణం సంక్లిష్టంగా మారుతోంది. ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకుంటున్నాయి. కానీ తీరా వర్షం పడుతుందనుకునే సమయానికి మేఘాలు మాయమైపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ, ఎక్కడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు.

వాతావరణ శాఖ అధికారులు ప్రతిరోజూ భారీ వర్షాలంటూ హెచ్చరికలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పొడి వాతావరణమే కనిపిస్తోంది. కురిసే వరకు వర్షాలపై స్పష్టత లేదని అధికారులే స్వయంగా చెబుతున్నారంటే రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.

సాధారణంగా జూన్ నెల వచ్చిందంటే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురవాలి. కానీ ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా రావడం, వాటి విస్తరణకు ఎక్కువ సమయం పట్టడంతో జూన్ నెలలో ఏకంగా 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది.

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో, ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితుల వల్లే వాతావరణం ఇలా అంచనా వేయలేని విధంగా మారిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత బలపడి ఆగస్టు నాటికి సూపర్ ఎల్‌నినోగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే తెలంగాణలో కరువు పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.

ఏరువాక పౌర్ణమి వచ్చేసినా…

వ్యవసాయానికి, మరీ ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ సాగుకు జూన్ నెల అత్యంత కీలకం. సోమవారం ఏరువాక పౌర్ణమి కూడా వచ్చేసింది. ఈ నెలలో కురిసే వర్షాలను బట్టే రైతులు విత్తనాలు వేసుకుంటారు. కానీ వాతావరణ శాఖ ప్రకటనలతో ఆశగా ఎదురు చూసే రైతన్నలకు నిరాశే ఎదురవుతోంది.

మబ్బులు పట్టినా వర్షం పడకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు జగిత్యాల, మహబూబాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడినా, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం పూర్తిగా ఎండ తీవ్రత, పొడి వాతావరణమే కొనసాగుతోంది.

రాబోయే మూడు, నాలుగు రోజులు రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని దాదాపు 15 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (భారీ వర్ష సూచన) జారీ చేసింది. అయితే ఉదయం పూట ఎండ తీవ్రత ఉండి, కేవలం సాయంత్రం వేళల్లోనే అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దుక్కి దున్నే రైతులు ఇప్పుడు డైలమాలో పడుతున్నారు.

హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల వరకు ఉండగా, మిగతా జిల్లాల్లో 36 నుంచి 39 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. జూలై మొదటి వారంలో రెండు, మూడు రోజులు కాస్త వర్షాలు పడినా, ఆ తర్వాత మళ్లీ ఎండల తీవ్రత పెరిగి, వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న ఈ భిన్నమైన పరిస్థితులపై ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. వ్యవసాయ, వాతావరణ శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. వర్షాలు తక్కువగా ఉన్నందున నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని, పడిన ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. రాబోయే రోజుల్లో నీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని స్పష్టం చేశారు.