కోసిగిలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు

గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు.. ఎద్దుల ఊరేగింపులు, పారువేట, పరుగు పందేలు ఆకట్టుకున్నాయి

కోసిగి, ఆంధ్రప్రభ : మండల కేంద్రం కోసిగితో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలను రైతులు ఘనంగా నిర్వహించారు. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుంచే రైతులు, ప్రజలు గ్రామదేవతలైన మారెమ్మదేవి, సుంకులమ్మదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, నారికేళాలు, పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.

ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి, పుష్కలంగా పంటలు పండాలని గ్రామదేవతలను ప్రార్థించారు. సాయంత్రం ఎద్దులకు స్నానాలు చేయించి, కొత్త రంగులతో అలంకరించి, పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం తప్పెడల నాదాల మధ్య ఎద్దులను గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు.

అనంతరం సిద్ధప్పపాళ్యం, నడిమిపాళ్యం, కడేపాళ్యాల్లో సంప్రదాయ ఎద్దుల పారువేట (కరి) నిర్వహించారు. కోసిగి ప్రధాన వీధుల్లో రంగురంగుల అలంకరణతో ఎద్దుల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా రైతులు ఏరువాక పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

ప్రతి ఏడాది నిర్వహించే సంప్రదాయం ప్రకారం కడేపాళ్యంలో పరుగు పందేలు ఉత్సాహంగా సాగాయి. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ మంజునాథ్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.